మీరు, గారు: గౌరవ స్థాయిని మీరే ఎంచుకోవాలి
ఇంగ్లీష్ 'you' ఒక్కటే. తెలుగులో డాక్టర్‌కి, Centrelink ఆఫీసర్‌కి 'మీరు', క్రియకు '-ండి', పేరు తర్వాత 'గారు'. పిల్లవాడితో మాత్రం 'నువ్వు'. ఆడియోలో ఈ సూచన ఉండదు, సందర్భం చూసి మీరే నిర్ణయించాలి. తెలుగు నుంచి ఇంగ్లీష్ వైపు మాత్రం 'గారు' కోసం 'Mr', 'Sir' కలపొద్దు, పేరు చాలు.
క్రియ చివరికి వస్తుంది
తెలుగు క్రియాంత భాష. 'the form that you submitted last week' తెలుగులో 'మీరు గత వారం ఇచ్చిన ఫారం' అని ముందుకు వస్తుంది, కాబట్టి 35 పదాల సెగ్మెంట్ మొత్తం విన్నాకే వాక్యం కట్టాలి. అటువైపు ఒత్తిడిలో తెలుగు క్రమమే బయటికొస్తుంది: 'I yesterday to the doctor went'.
'అని' అలవాటు, మూడో వ్యక్తిలోకి జారడం
తెలుగులో '...అని అంటున్నారు' అనడం సహజం. పరీక్షలో మాత్రం వక్త ఎలా చెప్పారో అలాగే మొదటి వ్యక్తిలో చెప్పాలి. 'మందుల ఖర్చు భరించలేకపోతున్నానని ఆమె చెబుతోంది' కాదు, 'ఈ మందుల ఖర్చు నేను భరించలేకపోతున్నాను'.
అంకెలు: లక్ష, కోటి, fortnight
అంకెలు చెప్పేటప్పుడు తెలుగు రూపాలే వాడాలని NAATI ప్రచురించిన CCL భాషా విధానం చెబుతుంది. తెలుగు నుంచి ఇంగ్లీష్ వైపు వచ్చేసరికి దాన్ని తలకిందులు చేయాలి: 1,50,000ని 'one hundred and fifty thousand' అనాలి, 'one point five lakh' కాదు. Centrelink చెల్లింపులు 'per fortnight' అంటాయి, అంటే రెండు వారాలకోసారి.
Centrelink, Medicare, bond: తెలుగు మాట లేని పేర్లు
Centrelink, Medicare, bulk billing, superannuation వంటి పేర్లకు తెలుగు మాట లేదు; పేర్లుగానే వదిలేయాలి. ఏమిటో వివరించడం మొదలుపెడితే అది చేర్పు. అద్దె bondని 'బాండ్' అనాలి, 'బంధం' కాదు. వినగానే గుర్తుపట్టడమే అసలు పని, ఎందుకంటే ఈ పేర్లు ఇండియాలో ఎక్కడా వినిపించవు.